గురజాడ అప్పారావు విశాఖ జిల్లా, రాయవరం (ఎలమంచిలి) లో, మేనమామ ఇంట్లో 1862 సెప్టెంబరు 21 న, వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు శ్యామలరావు అనే తమ్ముడు ఉన్నాడు. గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. అప్పారావు తండ్రి విజయనగరం సంస్థానంలో పేష్కారుగా, రెవిన్యూ సూపర్వైజరు గాను, ఖిలేదారు గానూ పనిచేసారు. తన పదవ ఏట వరకు అప్పారావు చీపురుపల్లిలో చదువుకున్నారు. తర్వాత, వారి తండ్రి కాలం చెయ్యటంతో, విజయనగరానికి వచ్చారు. ఇక్కడ చాల పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. ఈ సమయంలో అప్పటి ఎమ్. ఆర్. కాలేజి ప్రిన్సిపాల్ సి. చంద్రశేఖర శాస్త్రి ఈయనను చేరదీసి ఉండడానికి చోటిచ్చారు. 1882 లో మెట్రిక్యులేషను పూర్తిచేసి, తర్వాత 1884 లో ఎఫ్. ఎ చేసారు. ఇదే సంవత్సరంలో ఏం. ఆర్. హై స్కూలులో టీచరుగా చేరారు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి ఆయనకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు. ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను రాయవరం ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు.